Home National బ్లాక్‌ ఫంగస్‌ ఏంటి..? ఎలా వస్తుంది ..??

బ్లాక్‌ ఫంగస్‌ ఏంటి..? ఎలా వస్తుంది ..??

బ్లాక్ ఫంగస్‌ కేసుల వ్యవహారం కేంద్రాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ – 1897 ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ (మ్యూకర్‌ మైకోసిస్)ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించాలని, ఆ కేసుల వివరాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

ఈ వ్యాధి సరికొత్త సవాల్ అని.. బ్లాక్ ఫంగస్ కారణంగా మరణిస్తున్న కోవిడ్-19 పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు అంటువ్యాధుల చట్టం ప్రకారం బ్లాక్‌ ఫంగస్‌ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించాయి.

తమ రాష్ట్రంలో ఇలాంటివి 100 కేసులు బయటపడ్డాయని రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యాధి చికిత్సకు జైపూర్ ప్రభుత్వ ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

ఈ వ్యాధి మొదటిగా గుజరాత్, మహారాష్ట్రలలో బయటపడగా, ఇతర రాష్ట్రాలలోనూ కోవిడ్ రోగులలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు రిపోర్టులు వచ్చాయి.

భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో మ్యూకర్‌ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంటీ ఫంగల్ డ్రగ్స్ కొరత ఉన్నట్లు కూడా రిపోర్టులు వస్తున్నాయి. యాంఫోటెరిసిన్‌ బి అని పిలిచే ఈ మందును భారత దేశంలో అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే ఇప్పుడది బ్లాక్ మార్కెట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ వ్యాధి చికిత్సకు యాంటీ ఫంగల్ ఇంజెక్షన్ అవసరమని, దీని ఖరీదు రూ.3500 వరకు ఉంటుందని, ఎనిమిది వారాలపాటు దీన్ని ఇవ్వాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ ఒక్కటే ఈ వ్యాధికి ఏకైక మందు అని వారు చెబుతున్నారు. ఒక పక్క కేసులు పెరగడంతోపాటు, దీని ఇంజెక్షన్ కావాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు కూడా పెరుగుతున్నాయి.

గతంలో ఈ వ్యాధి ఇంజెక్షన్లు సులభంగానే దొరికేవని, కానీ గత మూడు వారాలుగా డిమాండ్ పెరగడంతో అవి దొరకడం కష్టంగా మారిందని ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఒక  ఫార్మసీ కంపెనీ యజమాని బీబీసీతో అన్నారు.మ్యూకర్‌ ‌మైకోసిస్ విషయంలో ఆందోళనతో పాటు, కుటుంబాలపై ఆర్థిక భారం కూడా పెరుగుతోంది. చికిత్సతో పాటు, ఔషధం కోసం కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

బ్లాక్ ఫంగస్ ఎలా వస్తుంది?

మ్యూకర్ మైకోసిస్ అరుదైన వ్యాధి. ఇది మ్యూకర్ ఫంగస్ వల్ల వస్తుంది. నేల, మొక్కలు, ఎరువులు, కుళ్లిన పండ్లు, కూరగాయలలలో వృద్ధి చెందుతుంది. మనిషి ముక్కులోని శ్లేష్మంలో కూడా ఇది మొదలవుతుంది.ఎవరికైనా కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, ఒకవైపు దవడ వాయడం, నాలుకపై నల్లటి మచ్చలు ఉంటే… అది బ్లాక్ ఫంగస్‌గా అనుమానించాల్సి ఉంటుందని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు.చాలామంది చికిత్స కోసం ఆలస్యంగా వస్తున్నారని, ఈ ఇన్‌ఫెక్షన్ మెదడు దాకా వెళ్లకుండా ఉండాలంటే కన్ను తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.అరుదైన పరిస్థితుల్లో రెండు కళ్లు, దవడను కూడా తొలగించాల్సి వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో వారిలో ఈ బ్లాక్ ఫంగస్ చేరే అవకాశం ఎక్కువని చెబుతున్నారు.

ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడుపై బ్లాక్ ఫంగస్ ప్రభావం చూపుతుంది.

డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, సైనస్, హెచ్ఐవీ, గుండె జబ్బులు ఉన్నవారిలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.క్యాన్సర్ చికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి జరిగిన వారు.. మోకాళ్ల నొప్పులు, ఉబ్బసం ఉన్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు.

అందుకే వారిలో కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతుంది.అలాగే దవడ, చర్మం, ఊపిరితిత్తులకు కూడా సోకుతుంది. బ్లాక్‌ ఫంగస్ అనేది సోకిన వెంటనే ప్రాణాలు తీసేంత ప్రమాదకర వ్యాధి కాకపోయినా, అలక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని ఈఎన్‌టీ వైద్యులు చెప్తున్నారు.కోవిడ్ తరువాత ఈ వ్యాధి సోకిన వారిలో 50 శాతం వరకు మరణాల రేటు ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.మ్యూకర్ మైకోసిస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ నుంచి బయటపడిన వ్యక్తులకు సరైన మోతాదులో స్టెరాయిడ్లు అవసరమని వైద్యులు చెబుతున్నారు.ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.స్వచ్ఛమైన ఆక్సిజన్, శుభ్రమైన నీటిని తీసుకోవాలని, డాక్టర్ సలహా లేకుండా యాంటీ ఫంగల్ మందులు, స్టెరాయిడ్లను వాడవద్దని కూడా ఐసీఎంఆర్ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here